నైష్కర్మ్య
సిద్ధి – 3,
4 & 5
శ్లో:
3. తయోశ్చ ప్రతిషిద్ధ కర్మ మూలత్వా ద నివృత్తిః:
విహిత, నిషిద్ధ కర్మలచే
పుణ్యపాపములు మరల మరల కలుగుచుండును. కావున పుణ్యపాపంబులకు పోకడ (పూర్తి నివృత్తి)
కలగదని భావము.
శ్లో.4: కర్మణశ్చ
రాగద్వేషాస్పదత్వాత్:
విహిత, నిషిద్ధ కర్మలకు,
రాగద్వేషములు కారణమగుటచే
నివృత్తి కలుగదు అని భావము.
శ్లో:
5. రాగ ద్వేషయోశ్చ శోభనాశోభనాధ్యాస నిబంధనత్వాత్:
శబ్దాది విషయములలో
ఇష్టాయిష్టములు పొడచూపును. ఇట్టి బుద్ధికి విషయమొకటియే యైనను దేశ కాల కర్మల
ననుసరించి మారుతూ ఉండును. ఒకప్పుడు ఇష్టమైనది
మరొకప్పుడు కాకుండునని భావము.
మనలోని ఇష్టాయిష్టములు, రాగద్వేషములే మన ఆంతరంగిక ప్రపంచము. మన ఇష్టాయిష్టములను
బట్టి ప్రపంచములోని వస్తువులకు లేనిపోని విలువలను ఆపాదించి, వాటి
పట్ల ఆకర్షణకులోనై, అదే మనం అయినట్లు భ్రాంతి చెందుచున్నాము.
ఈ ఆసక్తి, ఆకర్షణ అనేవి నేను నేనుగా ఉండకుండా జగత్తు భావనను
అనుమతించేట్లు చేస్తున్నాయి. మనస్సు విషయాల యెడల ఆలోచనలు కలిగిస్తూ జీవుడిగా
చేస్తున్నది. ఆ మనస్సుకు విలక్షణంగా ఉండగలిగితే ముక్తుడవే. అందువలన శరీరమునకు నేను
భిన్నమైన వాడిని, అధిష్టానమును. నేను శరీరమును ధరించిన వాడను,
శరీరము నాకు ఒక పనిముట్టు అని భావించి జీవించు వానికి, వ్యవహారములో జగత్తు బంధము కాజాలదు. వస్తువునకు విలువ ఆకర్షణను బట్టి కాక,
వినియోగమును బట్టి ఇచ్చి, దానిని
వినియోగించుకున్నట్లయితే, ఆ వస్తువుతో తాదాత్మ్యము చెందే అవకాశం ఉండదు. ఆసక్తి, ఆకర్షణల నుండి బయటకు వస్తే, జగత్తు ఏమీ చేయజాలదు.
బలీయమైన ఆకర్షణ కలిగినపుడు మనస్సును మరొక దానిపై మరల్చుట, శ్వాసపైకి
మరల్చుట తాత్కాలిక ఉపశమన పద్ధతులు. మనస్సును ఆత్మలో సంయమనము చేయుట అనేది మరల
తలెత్తకుండా ఉండే విధమైన శాశ్వత పరిష్కారము.